వినూత్న ఆలోచనలకు మెరుగులుదిద్దితే ఆవిష్కరణలుగా మారతాయి, అద్భుతాలు జరుగుతాయి.
అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహించడానికి ‘యంగ్ ఇన్నొవేటర్స్ ప్రోగ్రాం’ రూపొందింది. విద్యార్థి దశ నుంచే ప్రయోగాలపై అవగాహన కలిగించి వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దీన్ని ఐఐటీ ఖరగ్‌పూర్ 2017లో ప్రారంభించింది.
ప్రధానంగా మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రయోగాల ద్వారా వాటికి పరిష్కారాలు కనుక్కునేందుకు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ ఆహ్వానం పలుకుతోంది.
దేశంలోని అన్ని పాఠశాలలకు చెందిన 8, 9, 10వ తరగతి విద్యార్థులు దీనిలో భాగస్వాములు అవ్వొచ్చు. ఒక టీములో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు పాల్గొనవచ్చు.
నాలుగు రౌండ్లలో ఎంపిక ఉంటుంది. మొదటి రెండు రౌండ్లు ఆన్‌లైన్‌లో ఉంటాయి.
మూడు, నాలుగు రౌండ్లు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నిర్వహిస్తారు.
మొదటి రౌండ్‌లో విద్యార్థులు ఆన్‌లైన్‌లో పంపించిన ప్రాజెక్టు థీమ్, నేపథ్యం ఆధారంగా ఎంపిక ఉంటుంది. దీని చివరి తేదీ ఆగస్టు 16.
ఈ రౌండ్ ఫలితాలు ఆగస్టు 23న విడుదల చేస్తారు. * రెండో రౌండ్‌లో ప్రాజెక్టు సారాంశాన్ని వీడియో రూపంలో పంపాల్సి ఉంటుంది.
దీని ప్రారంభ తేదీ ఆగస్టు 23, చివరి తేదీ సెప్టెంబరు 16. రెండో రౌండ్ ఫలితాలు సెప్టెంబరు 24న విడుదల చేస్తారు. * చివరి రెండు రౌండ్లకు ఎంపికైన విద్యార్థులు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాజెక్టులను నిత్య జీవితంలో ఏవిధంగా ఆచరణలోకి తీసుకురావచ్చనే అంశం ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.
దీనికి ప్రారంభ తేదీ సెప్టెంబరు 24, చివరి తేదీ అక్టోబరు 1.
ఈ రౌండ్‌ను నవంబర్ 8, 9, 10 తేదీల్లో నిర్వహిస్తారు. చివరి రౌండ్ అనంతరం విజేతలను ప్రకటిస్తారు.
అత్యుత్తమ పాఠశాలల్లోని విద్యార్థులతో పోటీపడే అవకాశం, సుప్రసిద్ధ పరిశోధకులు, అతిథుల సమక్షంలో ప్రాజెక్టులను ప్రెజెంట్ చేసే అరుదైన సందర్భం ఈ ప్రోగ్రాం వల్ల సాధ్యమవుతుంది. ప్రాజెక్టుకు ఎంచుకోవాల్సిన అంశాలు పెరుగుతున్న జనాభాకు సరిపడా వనరులు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెడుతున్నారు.
దీని కారణంగా మానవ జీవన విధానంలో ఆహార, ఆరోగ్య అలవాట్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
దాంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి.
విద్యార్థులు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు ప్రాజెక్టులను పంపడానికి కింది అంశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
1. పవన, సౌరశక్తి (క్లీన్ ఎనర్జీ), పర్యావరణం:
భూమిపై నానాటికీ కాలుష్య తీవ్రత, గ్లోబలైజేషన్ పెరిగిపోతోంది. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దాన్ని తగ్గించేందుకు పాటించాల్సిన పద్ధతులు. 2. ఆరోగ్యం, పరిశుభ్రత:
ప్రపంచంలో పెరుగుతున్న అపరిశుభ్రత కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన సమస్యలతో అనేకమంది మరణిస్తున్నారు. ఆరోగ్యం పట్ల వహించాల్సిన శ్రద్ధ. 3. హార్డ్‌వేర్ మోడలింగ్:
అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశానికి టెక్నాలజీ ఎంతో ముఖ్యం. సంక్లిష్ట వ్యవస్థ (కాంప్లెక్స్ సిస్టమ్స్)లను డిజైన్ చేయటానికి హార్డ్‌వేర్ మోడలింగ్ కీలకమైంది. దైనందిన జీవితంలో ఉపయోగిస్తున్న హార్డ్‌వేర్ సొల్యూషన్స్.. 4. ఉత్పత్తి రూపకల్పన:
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో రోజువారీ జీవితంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించే విధంగా విద్యార్థులు ప్రాజెక్టులను ఎంచుకోవాలి. 5. విపత్తు నిర్వహణ:
మానవ తప్పిదాల వల్ల సంభవిస్తున్న సహజ విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పరిష్కార మార్గాలను కనుక్కోవాలి. సునామీ, తుపాను, వరదలు, మృత్తిక క్రమక్షయం తగ్గుదలకు అవలంబించాల్సిన మార్గాలు. 6. ఆర్థిక సమతుల్యత (ఫైనాన్షియల్ ఇంక్లూజన్):
గ్రామీణ ప్రాంతాల్లో అల్పాదాయ వర్గాల వారిలో ఆర్థిక సమతుల్యత తీసుకురావటానికి ఎలాంటి పద్ధతులు అవలంబించాలి? వారికి బ్యాంకింగ్ సేవలను ఎలా అందుబాటులోకి తీసుకురావాలి.
గత రెండు సార్లు నిర్దేశించిన ప్రాజెక్టులు
* రహదారులపై ట్రాఫిక్‌ను ఎలా తగ్గించాలి, ప్రమాదాలు జరగకుండా ఎలాంటి నియమాలు పాటించాలి, కాలుష్యాన్ని ఎలా నియంత్రించాలి?
ఇంట్లో ఉపయోగిస్తున్న ఏసీ, రిఫ్రిజిరేటర్స్ నుంచి ఎక్కువ మోతాదులో వాతావరణంలోకి వెలువడుతున్న వేడిని ఎలా నియంత్రించాలి.
వీటి ద్వారా గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా పెరుగుతుంది? * రోడ్లపై స్వీపర్ల అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా చెత్తను తొలగించటానికి ‘ఆటోబిన్’ గురించి.. * వాహనాల నుంచి వెలువడుతున్న కర్బన ఉద్గారాలు ఏ విధంగా గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయి? * తాగునీటిని ఇంట్లోనే ఎలా శుద్ధి చేయాలి?
నమోదు ఎప్పుడు? యంగ్ ఇన్నొవేటర్స్ ప్రోగ్రాంకు.. రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (ఆన్‌లైన్‌లో చెల్లించాలి). ఆఖరు తేదీ: ఆగస్టు 9, 2019