బేసిక్ సైన్స్ విద్యార్థుల కోసం ఉపకారవేతనాలు ఎదురుచూస్తున్నాయి.
వీరిని పరిశోధనల దిశగా ప్రోత్సహించడానికి కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)ను ఇండియన్ స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులతోపాటు డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రథమ సంవత్సరపు సైన్స్ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. కేవీపీవై -2019కు ప్రకటన వెలువడిన సందర్భంగా ఈ స్కాలర్‌షిప్‌ల విశేషాలు తెలుసుకుందాం!
ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉపకార వేతనాలకు అర్హులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన విద్యార్థులు అయిదేళ్లపాటు ప్రతినెలా ఉపకార వేతనం అందుకోవచ్చు.
మొదటి మూడేళ్లు నెలకు రూ.5000 చొప్పున, తర్వాతి రెండేళ్లు ప్రతి నెలా రూ. 7000 వారి బ్యాంకు ఖాతాలో చేరతాయి.
ఎస్సీ ప్రథమ సంవత్సరంలో ఉంటుండగానే మొదలయ్యే ఈ స్కాలర్‌షిప్ పీజీ పూర్తయ్యేవరకు కొనసాగుతుంది.
ఎంపికైనవారికి దేశంలోని ప్రముఖ సైన్స్ పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తారు. విద్యార్హతను బట్టి రాతపరీక్షను 3 స్ట్రీమ్‌లు ఎస్ఏ, ఎస్ఎక్స్, ఎస్‌బీగా విభజించారు.
స్ట్రీమ్ ల వారీ
ఎస్ఏ:
ప్రస్తుత అకడమిక్ సంవత్సరం (2019-20)లో సైన్స్ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) జూనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ విభాగంలోకి వస్తారు.
పదో తరగతిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 75 శాతం మార్కులు సాధించినవారు కేవీపీవై నిర్వహించే రాతపరీక్షకు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 65 శాతం మార్కులు పొందాలి. అలాగే వీరు ఇంటర్లో కనీసం60% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
దీంతోపాటు 2021-22 విద్యా సంవత్సరంలో బేసిక్ సైన్సెస్ (బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బీమ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్) కోర్సుల్లో చేరితేనే ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. వీళ్లు సీనియర్ ఇంటర్‌లో ఉన్న సమయాన్ని ఇంటెరిమ్ పీరియడ్‌గా పరిగణిస్తారు.
ఈ వ్యవధిలో ప్రాంతీయ, జాతీయ స్థాయి సైన్స్ క్యాంపులకు ఆహ్వానిస్తారు.
ఎస్ఎక్స్:
ఈ విద్యా సంవత్సరంలో అంటే 2019-20లో సైన్స్ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) సీనియర్ ఇంటర్ చదువుతున్న వాళ్లు ఎస్ఎక్స్ స్ట్రీమ్ కిందికి వస్తారు. వీరంతా పదో తరగతిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 75 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 65 శాతం) మార్కులు పొందినవారై ఉండాలి. అలాగే సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 50 శాతం) మార్కులతో ఇంటర్ పూర్తిచేయాలి. తోపాటు వీళ్లంతా 2020-21 విద్యా సంవత్సరంలో బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బీమ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్ కోర్సుల్లో చేరితేనే స్కాలర్‌షిప్ వర్తిస్తుంది.
ఎస్‌బీ:
ఈ విద్యా సంవత్సరంలో అంటే 2019-20లో ప్రథమ సంవత్సరం బీఎస్సీ/బీఎస్/బీస్టాట్/బీమ్యాథ్స్/ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఎంఎస్ కోర్సులు చదువుతున్న వాళ్లు స్కాలర్‌షిప్ కోసం నిర్వహించే రాతపరీక్షకు అర్హులు.
వీళ్లు సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులైతే 50 శాతం) మార్కులతో ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించాలి.
ఎంపిక విధానం జాతీయస్థాయిలో జరిగే ఆన్‌లైన్ పరీక్షలో మంచి ప్రతిభ చూపినవారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.
పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ద్వారా ఎంపిక చేపడతారు.
ఆప్టిట్యూడ్ పరీక్షలో పొందిన మార్కుల్లో 75 శాతం+ ఇంటర్వ్యూ మార్కుల్లో 25 శాతం కలిపి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
పరీక్ష ఇలా! రాతపరీక్ష కోసం ప్రత్యేకమైన సిలబస్ అంటూ నిర్దేశించలేదు.
విద్యార్థికి సైన్స్ సబ్జెక్టుల్లో ఉన్న అవగాహన, అర్థం చేసుకునే తీరు, విశ్లేషణను పరిశీలిస్తారు.
అయితే ప్రశ్నలు సాధారణంగా వాళ్లు రాసే స్ట్రీమ్ బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రథమ సంవత్సరంలోని సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల స్థాయిలో ఉంటాయి. ఆన్‌లైన్ మాక్ టెస్టు కేవీపీవై వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దాంతో ప్రశ్నపత్రంపై ఒక అవగాహనకు రావచ్చు. ఎస్ఏ స్ట్రీమ్ వారికి సైన్స్, మ్యాథ్స్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.
ఎస్‌బీ, ఎస్ఎక్స్ స్ట్రీమ్‌ల్లో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో నాలుగు సెక్షన్లు.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీల్లో ఉంటాయి.
రెండో భాగంలోనూ ఈ అంశాలతోనే నాలుగు సెక్షన్లు ఉంటాయి. అయితే అభ్యర్థులు మొదటి భాగంలో కనీసం మూడు సబ్జెక్టులు, రెండో బాగంలో కనీసం రెండు సబ్జెక్టుల్లోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది.
పాత ప్రశ్నపత్రాలు, సమాధానాలు కేవీపీవై వెబ్‌సైట్‌లో ఉంచారు.